రేపటి నుంచి ‘రైతు గోస - బీజేపీ భరోసా’ యాత్ర: రఘునందన్ రావు
- రైతులతో రాజకీయాలు చేయడం రేవంత్ కు అలవాటుగా మారిందన్న రఘునందన్ రావు
- అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలను చూసి ప్రజలకు సీఎం తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శ
- ప్రభుత్వ వైఫల్యాలపై నేరుగా రైతులతోనే మాట్లాడిస్తామన్న బీజేపీ ఎంపీ
రాష్ట్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రేపటి నుంచి ‘రైతు గోస - బీజేపీ భరోసా’ పేరిట ప్రత్యేక యాత్రను చేపట్టబోతున్నట్లు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు. ఈ యాత్రలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున పాల్గొంటారని ఆయన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి రైతులతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు.
రాష్ట్రంలో ఎనభై శాతం ధాన్యం కొనుగోలు ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు. అధికారులు ఇచ్చిన తప్పుడు నివేదికలను చూసి సీఎం ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయనకు నచ్చిన జిల్లాకు వెళ్లి క్షేత్రస్థాయిలో నేరుగా రైతులతో మాట్లాడితే, కొనుగోళ్లు ఎంతవరకు జరిగాయో అసలు నిజాలు తెలుస్తాయని హితవు పలికారు.
ఈ రెండు రోజుల యాత్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల మీద తాము నేరుగా రైతులతోనే మాట్లాడిస్తామని రఘునందన్ రావు పేర్కొన్నారు. తాము రాజకీయాలు చేయాలనుకుంటే వేరేలా చేస్తామని, కానీ తమకు కావాల్సింది కేవలం అన్నదాతల సంక్షేమమేనని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.